RCB vs RR: ఎవె-గ్రౌండ్‌లను టార్గెట్ చేసిన బెంగళూరు.. సాల్ట్, కోహ్లీల ఖతర్నాక్ ఇన్నింగ్స్.. 9 d ago

IPL లో భాగంగా 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో RCB జట్టు రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో తప్ప ఇతర మైదానాల్లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించింది.
RCB జోరు చూస్తుంటే ఈసారి టైటిల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB జట్టు.. రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. భారీ హిట్టింగ్ లైన్ అప్ ఉన్న RR జట్టును నిదానంగా ఉంచారు. యశస్వి జైశ్వాల్ ఒక్కడే 47 బంతుల్లో 75 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లు ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు.
సంజు శాంసన్ (15), పరాగ్ (30), హెట్మైర్ (9) పెద్దగా ఆకర్షించలేదు. జురెల్ (35) కాస్త వేగంగా ఆడటంతో.. RR జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చేతిలో వికెట్లు ఉన్నా.. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు బ్యాటర్లు అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. బెంగళూరు తరుపున భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన RCB ఓపెనర్లు.. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. అసలు ఫిలిప్ సాల్ట్ అయితే విజృంభించేసాడు. పిచ్ ఏదైనా.? బౌలర్లు ఎవరైనా.? హిట్టింగ్ ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఇదే పిచ్‌పై బౌండరీల మోత మోగించాడు. 6 సిక్స్‌లు, 5 ఫోర్లతో 33 బంతుల్లో 65 రన్స్ స్కోరు చేశాడు.
ఫిలిప్ సాల్ట్ ఉన్నంతసేపు నిదానంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ (62*).. ఆ తర్వాత జూలు విదిల్చాడు. వరుస పెట్టి బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు... ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు... సాల్ట్ ఔట్ తరువాత బరిలోకి దిగిన పాడిక్కాల్ (40*) కూడా మ్యాచ్‌ని త్వరగా ముగించే పనిలోనే ఉన్నాడు. వీరిద్దరు శరవేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. ఒక వికెట్ నష్టానికి 175 పరుగులు చేశారు. బ్యాట్ తో మోతమోగించిన ఫిలిప్ సాల్ట్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు.